Sunday, September 5, 2010

గురు వందనం

శ్రీ గురుభ్యోనమః

స్రుష్టి లోని గురువులందరికి పాదాభివందనాలు చెయ్యటానికి ఒక ప్రత్యేకమైన దినం ఏమీ అక్కరలేక పోయినా, ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము కనుక ఇవ్వాళ్ళ విశేషమైన దినం గా మరింత శ్రద్ధ గా గురువుని తల్చుకుందాము.

ముందుగా "మమతాను రాగాల కల్పతరువై, మంచి చెడు నేర్పించు మాత్రు పద పద్మముల కిదె తొలి వందనం"(ఒక కవి గారి మాట).

ఒక వ్యక్తి జీవితం లో అత్యంత ప్రముఖమైన స్థానం తల్లిదండ్రులది. వీరిలో కూడా తల్లి నే ముందుగా తల్చుకుంటారు ఎందుకంటే, తల్లి తొలి గురువు. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిది.ఆచార్యుడి స్థానం విశిష్టమైనది.

అందుకే మన సాంప్రదాయం లొ "మాత్రు దేవోభవ, పిత్రు దేవోభవ,అచార్య దేవోభవ" (తరువాత అతిధి దేవొభవ అంటారు, ఆ ప్రస్తావన ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి)అంటాము.

గురువు అనే ప్రస్తావన రాగానే, మనకి ముందు గా గుర్తు వచ్చేది, గురు దత్తాత్రేయ, మేధా దక్షిణా మూర్తి, ఒక విశ్వామిత్రుడు, ఒక పరశురాముడు,తరువాత మానవ శరీరాన్ని స్వీకరించి జగత్తుని ఉద్ధరించిన జగద్గురు ఆది శంకరాచార్య, ఒక ద్రోణాచార్య, మొదలైన వారు.

ఈ కాలం లో అయితే, ఒక సర్వేపల్లి రాధాక్రిష్ణన్, ఒక అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారిని, మీకు దైవమూ,గురువూ ఒకే సారి ప్రత్యక్షం అయితే మీరు ముందు గా ఎవరికి నమస్కరిస్తారు అని అడిగితే, తొలి నమస్కారం గురువుకే అని చెబుతూ, ఆ దైవాన్ని కూడా చూపించింది గురువే కదా అని వివరణ ఇవ్వటం జరిగింది. అది, గురువు యొక్క స్థానం.

ఇక ఆది శంకరాచార్య విషయం లో గురు అనుగ్రహం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు. ఒక రోజు పాఠం మొదలు పెట్టకుండా, కొంచెం సేపు ఆగివేచి చూస్తున్నారట. మిగిలిన శిష్యులు ఆచార్యా, అందరము ఉన్నాము కదా, ఎవరి కోసం వేచి ఉన్నారు అని అడిగితే, తోటకాచార్యుడు రావాలి కదా అన్నారట.అతనికి మేధస్సు తక్కువ, అతను శారీరక శ్రమ చేసే వ్యక్తే కానీ, చెప్పింది గ్రహించగల నేర్పు కానీ, ధారణ చెయ్యగల మేధస్సు కానీ లేవు అని మిగిలిన శిష్యులు వ్యాఖ్యానిస్తే, గురువుగారు నవ్వి తోటకాచార్యుడిని పిల్చి, శ్లోకాలు చెప్పమంటే ఆశువుగా గురువు గారి మీద చెప్పిన స్తోత్రాలు విని ఆశ్చర్య పోవటం మిగిలిన శిష్యుల వంతు అయిందిట. ఈ నాటికీ గురు వందనానికి ఆ శ్లోకాలే ప్రామాణికం గా చెప్పబడుతున్నాయి.

అది గురు అనుగ్రహమంటే.

శిష్యులని పరిశీలన గా చూసి ఎవరి శక్తి ఎంతో, ఎవరికి ఎందులో నైపుణ్యం ఉన్నదో అంచనా వేసి అందులో వారిని నిష్ణాతులని చెయ్యటమే గురువు గారు చేసే పని. అది వారికి జీవితం లో ముందు ముందు సరి అయిన దారి చూపిస్తుంది అని మన సనాతన ధర్మం, చరిత్ర,మరియు అనుభవము చెబుతున్నాయి.

ఇంక నా విషయానికి వస్తే, ప్రాధమిక విద్యా స్థాయి నించి చెప్పుకుంటూ వస్తే -

7త్ క్లాస్స్ లో ఉండగా, విజయవాడలో, మా తెలుగు టీచర్ ఒక నాడు (నేను సంవత్సరం మధ్యలో ఆ స్కూల్ లో చేరటం జరిగింది)బాల క్రిష్ణ లీలల నించి "చల్దులారగించుట" అనే పద్య భాగం లో ఒక పద్యం లోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దెబ్బ వేసి నా సహాధ్యాయి చేత చెప్పించటం చూసి, భయం తో నేను అప్పటికప్పుడు నోటికి నేర్చుకున్న పద్యం ఇప్పటికీ నా మనసులో అలా ఉండి పోయింది.

ఇక 10త్ క్లాస్స్ కి మేము హైదరాబాద్ కి రావటం జరిగింది. అక్కడ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో మాకు లెక్కలకి ప్రమీల టీచర్ వచ్చే వారు. ఆవిడ మొట్ట మొదటి రోజు నన్ను చూసి, కొత్త స్టూడెంట్ ని అనుకోకుండా, నా తెలివితేటలు తెలియక పోయినా, ఒక్క సారిగా నా భుజం తట్టి నువ్వు మ్యాథ్స్ లో నేషనల్ అవార్డ్ తెచ్చుకుంటావా అని అడగటం నాకు మనో ఫలకం మీద అలా ముద్ర పడి పోయింది. ఆవిడ లెక్కలు చెప్పే విధం ఎంత సులువు గా ఆత్మీయం గా ఉండేదో చెప్పాలంటే, ఆ స్కూల్ లో ఒక బిలోయావరేజ్ విద్యార్ధి కూడా 90% పైన మార్కులు తెచ్చుకోవటం చూస్తే అర్ధం అవుతుంది. ఆవిడ తర్ఫీదులో నేను ఎప్పుడూ, ఎలాంటి కొత్త లెక్క ఇచ్చినా వెంటనే నిముషాలలో చేసే దాన్ని. లెక్కల పట్ల నాకు ఉన్న ఇంట్రస్ట్ ని, నేను ఇంట్లో వాళ్ళ లెక్కల భయం వలన,కొన సాగించలేక పోయాను.

మళ్ళీ ఎమ్మే స్థాయి లో, ఎకనామిక్స్ లో ఒక పేపర్ గా రెండు సెమిస్టర్ ల లో చదివి త్రుప్తి పడ్డాను.

ఇక కాలేజ్ స్థాయి లో మాకు దొరికిన అపురూపమైన లెక్చరర్ శ్రీమతి పద్మజ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ మాకు సోషియాలజీ టీచ్ చేసే వారు. ఆవిడ మమ్మల్ని వ్యక్తులుగా మలిచిన తీరు అద్భుతం. మేము ఆ క్లాస్ లో చేరేటప్పటికి ఆవిడ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. ఆవిడ తిరిగి డ్యూటీ లో చేరే వరకు ఇంకొక వ్యక్తి మాకు ఆ సబ్జక్ట్ టీచ్ చేశారు. మాకు ఏమీ బోధ పడక, ఆ సబ్జక్ట్ మూడు సంవత్సరాలు ఎలా చదవాలో, ఎలా పాస్ అవ్వగలమో తెలియక ఒక అయోమయ అవస్థలో ఉన్నాము.

ఆవిడ డ్యూటీ లో చేరగానే, మా ఆత్మీయురాలు ఎవరినొ చూసినట్లు (అంతకు ముందు మేము ఆవిడని ఎరగము) భావించి, ఆ సబ్జక్ట్ పట్ల మా భావాలు, అభిప్రాయాలు ఏకరువు పెట్టాము. ఆవిడ ఒక చిరునవ్వుతో మమ్మల్ని చూసి, ఇన్ని మాటలు ఆ విషయం గురించి ఇంత ధాటిగా, నమ్మకంతో మాట్లాడిన మీకు ఆ ఇయర్ సిలబస్ అంతా వచ్చేసింది, ఇంక దేని గురించి మీ భయం అనేటప్పటికి ఆశ్చర్యపోవటం మా వంతు అయింది.

ఏదైనా మనం గమనించటాన్ని బట్టే, ఆ విషయం పట్ల మన ఆసక్తి, శ్రద్ధ తెలిసి పోతుంది అని చెప్పేవారు.

ఆవిడ మాతో మాట్లాడే విధాన్ని బట్టి మేము కాలేజ్ లో మిగిలిన సబ్జక్ట్ ల గురించి ఆవిడతో నిర్భయం గా చర్చించే వాళ్ళం. ఒక సారి ఇంగ్లీష్ లో "సర్వేపల్లి రాధాక్రిష్ణన్" వ్రాసిన పాఠం మాకు బాగా అర్ధం అయి, "జవహర్లాల్ నెహ్రూ" పాఠం అర్ధం కాలేదు అని చెబితే, మమ్మల్ని చూసి ఆవిడ మీరు మేధావులు, మీకు రాధాక్రిష్ణన్ అర్ధం అయి, నెహ్రూ అర్ధం కాలేదు అంటే, కేవలం మీ శ్రద్ధలో లోపమే కానీ ఇంకొకటి కాదు. రోజూ నా కోసం ఒక గంట చదవండి, ఏదైనా ఇట్టే అర్ధం అవుతుంది అని మమ్మల్ని వెన్ను తట్టిన విధం మమ్మల్ని ఆశ్చర్య చకితులని చేసి మమ్మల్ని ఆవిడకి మరింత దగ్గర చేసింది.

అంతే కాదు, మేము సోషియాలజీ లో పాఠాంతర్గతం గా కొన్ని గిరిజన తెగల గురించి చదువుతూ, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి గేలి చేసినప్పుడు, స్రుష్టి లో ప్రతి విషయం పట్ల సదవగాహన ఉండాలనీ, ఏ జీవన విధానం అయినా, ఆచారం పాటించటానికైనా ఎంతో చరిత్ర మరియు ప్రాక్రుతిక లభ్యతలు/అలభ్యతలు కారణమని చెబుతూ మమ్మల్ని సరి అయిన దారిలో అలోచింప చేశారు.

ఏ విషయం పట్ల చులకన భావం, హేళన పనికి రావని చెప్పే వారు. సహ్రుదయం పెంచుకోవాలని చెప్పే వారు.

ఆ అలవాటే ఇప్పటికీ నన్ను ఒక విషయం పట్ల ప్రెజుడిస్ పెంచుకోకుండా విశాల ద్రుక్పధం తో అలోచించే స్థాయి కి ఎదిగేలా చేసింది. అది గురువు గా ఆవిడ మాకు చేసిన గొప్ప ఉపకారం.

కానీ మా దురద్రుష్టం కొద్దీ ఆవిడ ఇప్పుడు లేరు, ఆవిడ బోధనలు జీర్ణం చేసుకుని ఎదిగిన వ్యక్తులుగా క్రుతఙ్ఞతలు తెలియ జేసుకునే అవకాశం మాకు లేనందుకు బాధపడటం తప్ప ఏమి చెయ్యగలము?

కానీ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా ఆవిడ గురించి ప్రస్తావించకుండా ఒక్క మాట కూడా చెప్పలేను. అర్ధవంతంగా నేను మాట్లాడే ప్రతి మాట లోనూ ఆవిడ సజీవంగా తొంగి చూస్తూ ఉంటారు.

అలాగే నేను ఎమ్మే లో చేరాక మాకు జోసెఫ్ అనే ఒక ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్ టీచ్ చేసే వారు. ఆయన కూడా మాకు జీవితం గురించి వాస్తవ ద్రుష్టి ఎలా ఏర్పరుచుకోవాలో చెప్పే వారు. ఏదో ఒక సంఘటన ని బట్టి ఒక వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు, అవతలి వారి షూ లో కాళ్ళు పెట్టి, ఆ సందర్భం లో ఉంటే మనము ఎలా ప్రవర్తించేవాళ్ళము అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలే కానీ తొందర పడి వ్యక్తిత్వాల పట్ల దురభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు అని చెప్పేవారు.

ఈ విధం గా నాకు దొరికిన మంచి గురువులు, మార్గ నిర్దేశకుల గురించి తల్చుకోవటంద్వారా, నా ఙ్ఞాపకాలని, అద్రుష్టాన్ని మీతో పంచుకోవటానికి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

గురువుని గౌరవించటం అంటే మన ని మనము గౌరవించుకోవటం, మన వారసత్వాన్ని, వ్యవస్తని గౌరవించటం అన్న మాట.

గురువుని అగౌరవపరిచే నేటి హీన స్థితి నించి మళ్ళీ మనల్ని మనము సంస్కరించుకుందాము అని ఈ రోజున ప్రమాణం చేద్దామా!

Wednesday, September 1, 2010

నేటి తరం పిల్లల భావాలు -పిచ్చా పాటి గా

నిన్న నేను పేపర్ చదువుతూ వ్యాపార ప్రకటనల పుణ్యమా అని తల్లి అనే వ్యక్తి,అచ్చం ప్రకటనల్లో చూపించినట్లు, ఎలా ఉండాలని తాము కోరుకుంటున్నారో చెప్పిన పిల్లల (15-16సంవత్సరాల వయసు ఉన్న)భావాలు చదివి ఆశ్చర్య పోయాను.

బట్టలు నలగకుండా, జుట్టు చెరగకుండా, మొహం లో అలసట కనిపించకుండా సదా మీ సేవ లో అనేట్లు కనిపిస్తూ అత్యంత ఆదర్శ వంతం గా, ఆధునికం గా, ఆంగ్ల భాషని అనర్గళం గా మాట్లాడుతూ, ఎప్పుడు ఫ్రెష్ గా చిరు నవ్వు నవ్వుతూ, పిల్లలని అస్సలు కోప్పడకుండా ఉండాలని నేటి తరం పిల్లలు కోరుకుంటున్నారని తెలిసి ఒకింత నిర్ఘాంత పోయాను.

ఈ పిల్లలకి తండ్రుల పట్ల పెద్ద గా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవుట.

బాగుంది వినటానికి. ఎందుకంటే మన సనాతన ధర్మం ముందే స్త్రీ (గ్రుహిణి కూడా అనుకోవచ్చు) కి ఉండవలసిన లక్షణాలని ఆరు విధాలుగా నిర్వచించింది. అవి "కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ" అని. మరి నేటి తరం పిల్లలకి కూడా తల్లుల పట్లే నిర్దుష్టమైన అభిప్రాయాలు, కోరికలు. తండ్రులకి మినహాయింపు ఇచ్చేశారు.

కానీ ఆ సదరు పత్రిక ప్రతినిధులు, మరి మీ తల్లి దండ్రుల కోరిక ప్రకారం మీరు నడుచుకోగలరా అని ప్రశ్నించలేదు. అలాగే, ఇవ్వాళ్టి రోజున మిమ్మల్ని తీర్చి దిద్ది మీ అవసరాలు అన్నీ తీర్చిన తల్లిదండ్రులని వ్రుద్ధాశ్రమాలకి పంపించటం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగి ఉంటే ఏమి జవాబు చెప్పే వారో?

తల్లి పాత్రని వ్యాపార ప్రకటనలు నిర్ణయించటం ఎంత బాధాకరము!

ప్రకటనల్లొ, అర్ధ రాత్రి వరకు చదువుకుంటూ ఉండే పిల్ల/పిల్ల వాడికి తల్లి ఫ్రెష్ గా చెదరని చిరునవ్వుతో ఏదో ఒక హెల్త్ డ్రింక్ తెచ్చి ఇస్తుంది.

చదువుకునే పిల్లల అవసరాలు తల్లి తీర్చవలసిందే. కానీ తెల్లారి లేస్తే అనేక సమస్యలతో ఇంటా, బయటా సతమతమవుతున్న నేటి మహిళ, ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఇలా ప్రకటనల్లొ చూపించినట్లు, ఉన్న ఇద్దరో, ముగ్గురో పిల్లలకి ఎప్పుడు అవసరం వస్తె అప్పుడు చిరునవ్వులతో సేవ చెయ్యటం సాధ్యమేనా? అని పిల్లలు అలోచించేట్లు చెయ్యగలిగితె బాగుంటుందేమో కదా.

మన కోరికలు, ఆదర్శాలు అవతలి వ్యక్తులకి మాత్రమే చెందిన విషయమని, అందుకు అనుగుణం గా మనం ఏమి మారక్కరలేదని,పిల్లలు అనుకోకూడదు. అదేదో "ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అన్నట్లు ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు, తోటి కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత, పెద్ద తరం వాళ్ళ పట్ల సానుభూతి,ప్రేమ,కుటుంబం లో మన పాత్ర తెలుసుకునే అవకాశం పూర్వం ఉమ్మడి కుటుంబాలలోసహజం గా ఉండేది.నేడు అది క్రమంగా సన్నగిల్లి పోతున్నది.కుటుంబం లో ఎవరి పాత్రకి ఉండే పరిధులు వారికి ఉంటాయని, అందరూ వాటిని గౌరవించాలని, మన అవసరాలని,ప్రవర్తనని ఆ పరిధిలో ఇముడ్చుకోవాలనీ పిల్లలకి సులభం గా తెలిసేది.

పిల్లలకేమి తెలుసు పాపం, వాళ్ళు మైనం ముద్దల లాంటి వాళ్ళు, ఏ మూస లో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటారు.

ఈవ్యాపార ప్రకటనలు (అన్నీ అనను కానీ)ఏదో నేల ని విడిచి ఆకాశం లో విహరించటం లాగా ఉంటున్నాయి.
నిష్టూరం గానూ, చేదు గానూ ఉండే నిజాలని భరించే శక్తి ని ఏ వ్యాపార ప్రకటన అయినా ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళకి కావలసింది డబ్బు సంపాదించుకోవటానికి కావలసిన మాటల చేతల ఇంద్ర జాలం.


పిల్లలందరూ నేల విడిచి సాము చేస్తున్నారు అని కాదు నా భావం.కానీ ద్రుశ్య మాధ్యమానికి ఉన్న శక్తిని అత్యంత నేర్పు గా డబ్బు చేసుకోవటానికి పిల్లలని మాధ్యమంగా వాడుకుంటున్న వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్న పిల్లల సంగతే నేను చెప్పదల్చుకున్నది.

సమాజం లొ మార్పులు వేగం గా వస్తున్నాయి.ప్రతి సమస్య కుటుంబ స్థాయి లో ఏర్పడి తరువాత సామాజిక స్థాయికి విస్తరిస్తున్నది.

అందువల్ల పిల్లలకి బాధ్యతలు, వాళ్ళ వంతు పాత్ర పట్ల అవగాహన, సర్దుబాటు తత్వం ప్రయత్న పూర్వకం గా నేర్పాలి.

అలా అవి తెలియక పోవటం వల్లనేపిల్లలుఇప్పుడు ఈజీ గోయింగ్ ధోరణి లో ఉంటూ, అదే సరి అయిన పద్ధతి అనుకుంటున్నారు. కొండ మీది కోతి కావాలి, అది దొరక్క పోతే ఆత్మ హత్య ఒక్కటే శరణ్యం అనే విపరీత పోకడలకి పోతున్నారు.

మానసికం గా బలహీనులు అవుతున్నారు. తాము జీవితం నష్ట పోతూ తల్లి దండ్రులని కూడా క్షోభ పెడుతున్నారు.

మన దేశం లో పిల్లలని పెంచే తీరుకు, పాశ్చాత్య దేశాల్లో పిల్లలని పెంచే తీరు కి మౌలికమైన తేడా ఉన్నది.

పిల్లల్లో అంతర్లీనం గా ఉండే అద్భుత శక్తి చైతన్యం పదును పెడితేనే వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణిస్తారు అని మనము నమ్ముతాము. అందుకోసం అవసరమైతే మనము కొంచెం కఠినం గా పిల్లలతో వ్యవహరిస్తాము (కనీసం నటిస్తాము). వాళ్ళేమి మనకు శత్రువులు కాదు కదా. వాళ్ళల్లో అంతర్గతం గా ఉండే డైనమిక్ ఎనర్జీ ని వెలికి తీసే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం చిన్నప్పటి నించి శిక్షణా విధానం లొ చొప్పిస్తాము. కోరుకున్నవన్నీ పొందాలంటే - కష్టపడాలనీ, ఏదీ ఆయాచితం గా దొరకదనీ చిన్నప్పటి నించీ నేర్పుతాము. వ్యామోహాలు మంచివి కాదనీ, నిగ్రహ శక్తి అవసరమనీ చెబుతాము.

ఈ ప్రకటనలని తయారు చేసే వాళ్ళు కేవలం మార్కెటింగ్ టెక్నిక్ లు అనుసరిస్తూ, మనసుని ఆకట్టుకునే ధోరణిలొ,పర్యవసానాలు ఊహించని పోకడలకి పోతున్నారు.

దాని వల్ల పాశ్చాత్యపు ప్రభావం మన పిల్లల తరం మీద చాలా బలం గా పడుతున్నది.
తల్లి దండ్రులు, కుటుంబ విలువలు అనేవి అర్ధం లేని మాటలు గా తోచటం వల్లనే ఇవ్వాళ్ళ ఇన్ని ఒంటరి తల్లి దండ్రుల జీవితాలు, వ్రుద్ధాశ్రమాల ఉనికి - విస్తరణకి అవకాశం ఏర్పడింది.

అది ఒక సామాజిక అంశం అయింది.

తల్లులు ఆదర్శం గా ఉండాలి అని పిల్లలు కోరుకోవటం అనే ఒక్క విషయం మీద ఈవిడ ఇంత ఘాటుగా స్పందించిందేమిటి అనుకోకండి, ఏ సమస్య అయినా చిన్న గానే మొదలవుతుంది, అది తీవ్ర రూపం దాల్చినప్పుడే పది మంది ద్రుష్టి లో పడుతుంది. కాదంటారా!

Sunday, March 28, 2010

అమ్మ

ఈ రోజుకి అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళి పది సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది.

ఆవిడని తల్చుకోని క్షణం కానీ,సంఘటన కానీ లేదు.

ఇంట్లో ఒక వ్యక్తి మరణం కొంత విషాదాన్ని, కొంత శూన్యాన్ని మిగల్చటం సహజం, కొంత కాలానికి మర్చిపోయి మళ్ళీ మన దైనందిన జీవితపు పరుగులో పడటం కూడా సహజం.

మా అమ్మ భార్య గా మా నాన్నకి, తల్లి గా మాకూ ఒక వెలితిని మిగల్చటం లో పెద్ద ఆశ్చర్యం ఉండక పోవచ్చు. అంత ప్రభావం ఆవిడ మనవల మీద కూడా కలిగించింది. ఆవిడకి పదకొండు మంది మనవలు . వాళ్ళకి ఆవిడ ఒక అమ్ముమ్మ/నాయనమ్మ మాత్రమే కాదు, ఒక గురువు, దిశా నిర్దేశకురాలు, దైవం అన్నీ.

ఇంతే కాదు,ఆవిడ పరిచయం ఉన్న వాళ్ళు అందరూ ఆవిడ వ్యక్తిత్వాన్ని శ్లాఘించటం, సమర్ధతని/వ్యవహార
ఙ్గ్నానాన్ని మెచ్చుకోవటం అరుదుగా జరిగే విషయం కాకపోయినా, గొప్ప విషయమే.

ఆవిడ లౌకికమైన చదువులు చదువుకోలేదు, డిగ్రీ లు పొందలేదు.

కానీ మాకు ఎలా బతకాలో, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో, పరిష్కారం ఎల వెతుక్కోవాలో,మనుషులని ఎలా అర్ధం చేసుకోవాలో, మనస్తత్వాలని ఎలా అంచనా వెయాలో చక్కగా నేర్పి మమ్మల్ని అందరినీ బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దింది. ఒక ఆడది, అందునా నలుగురు పిల్లల తల్లి సమాజానికి ఏమి చెయ్యగలిగిందో చేసి చూపించి తన 59 అ యేట హఠాత్తుగా రెప్ప పాటు కాలం లో మేము బిత్తర పోయి చూస్తూ ఉండగా అనంత వాయువుల్లో కలిసిపోయింది.

ఆవిడకి చదువు అంటే ఎంతో ఇష్టం, గౌరవం. అందుకే మాకు చిన్నప్పుడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్, స్వామి వివేకానంద,ఆది శంకరా చార్య, త్యాగయ్య గురించి తను విన్నవి, చదివి తెలుసుకున్నవి కధలు కధలు గా ఆకట్టు కునే విధం గా చెప్పేది.

చాణక్త్యుడి అర్ధ శాస్త్రం గురించి చెబుతూ, పరిపాలన లో ఒక రాజు తీసుకో వలసిన జాగ్రత్తలు, ప్రజల పట్ల రాజుకి ఉండ వలసిన భావనలు అర్ధం అయ్యేట్లు చెప్పేది.వాటి అధారం గా రాజులు పాలన చేశారు కాబట్టే, మనకి ఇప్పటికీ ఇంకా ఆ చాయలు (ఎంత అధర్మం పెచరిల్లి పోతున్నా కుడా)అక్కడక్కడా కనిపిస్తూ ఊరట కలిగిస్తున్నాయి అని చెప్పేది.

ప్రక్రుతిని ప్రేమించటం, మనుషులని ప్రేమించటం, ఆర్తులని ఆదుకోవటం నేర్పించింది.

సంపాదించుకున్నడబ్బు తో ఎలా పొదుపు గా వెలితి అనేది తెలియకుండా, అసంత్రుప్తి లేకుండా బతకాలో నేర్పించింది. మనిషికి సంత్రుప్తి ఉండటం ఎంత అవసరమో, అది లేని జీవితాలు ఎలా నరక ప్రాయం గా ఉంటాయొ ఉదాహరణలతో చెప్పేది.

ఎవరైనా వ్రుత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తే, అది చూసి వాళ్ళు అలా సాధించటానికి చేసిన క్రుషి ని, అందుకోసం వాళ్ళు చేసిన త్యాగాలని అభినందించాలే కానీ కువిమర్శలు చెయ్యకుడదు అని చెప్పేది.వాళ్ళని చూసి అసూయ పడకూడదని, మనస్ఫూర్తి గా సంతోషించాలని చెప్పేది.

జీవితం లో సానుకూల వైఖరి ఎంతో అవసరమని, ఆర్తులని చూసి స్పందించమని చెప్పేది.

స్రుష్టి లో అందరు ఒకే విధమైన సమర్ధతలతో, ఙ్గ్నానం తో, తెలివి తేటలతో ఉండరు కనుక అవి లేని వాళ్ళ పట్ల సానుభూతి తో, అవగాహనతో ఉండాలని చెప్పేది.మనుషులని అర్ధం చేసుకుని వాళ్ళతో ప్రవర్తించటం నేర్చుకోమని చెప్పేది.

నేను బ్యాంక్ లో ఆఫీసర్ గా చేరటానికి ప్రోత్సహించి, ఆడపిల్లలు స్వావలంబన తో జీవించటం ఎంతో అవసరం అని చెప్పి నేను ఆవిడ కోరుకున్నట్లు బ్యాంక్ ఆఫీసర్ ని అయ్యాక ఎంతో త్రుప్తి పొందింది.

నన్ను అన్నతగా ప్రోత్సహించిన వ్యక్తి, నేను ఉద్యోగం లొ నించి (వీఆరెస్ ద్వారా) విరమించు కోవాలని నిర్నయించు కునే సమయానికి నాకు అందుబాటు లో లేకుండా వెళ్ళి పోయింది. నేను చేసింది తప్పో ఒప్పో తెలియచేసేటందుకు ఆవిడ లేని వెలితి ఏల పూడ గలదు.

ఆవిడ తీర్చి దిద్దిన మనవలు ఇవ్వాళ్ళ ఎంతో వ్రుద్ధి లోకి వచి పెద్ద పెద్ద చదువులు చదువుకుని డాక్టరేటె లు చేస్తూ ఉంటే చూసి ఆనందించి, వాళ్ళని ఆశేర్వదించటానికి ఆవిడ లేని వెలితి ని మాటల్లో ఎలా చెప్పగలను?

ఆవిడ చూపించిన దారిలొ నడిచి, పది మందికి ఉపయోగపడటం కన్న మేము ఆవిడకి ఇవ్వ గలిగిన నివాళి ఏముంది.

అదే చేసె ప్రయత్నం లో నా మనసు ని పది మంది తో పంచుకుందామని నేను ఆరాటపడి ఈ విధం గా క్రుతక్రుత్యు రాలిని అయ్యానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

ఇది వ్యక్తి గతం అయినా కూడా, ఒక తల్లి తల్చుకుంటే సమజానికి తన వంతు ధర్మం గా ఎంత సేవ చెయ్యగలదో చెప్పటానికి ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను.

"సర్వే జనా స్సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు"

సెలవు.

Sunday, February 7, 2010

పలుచ బడుతున్న మానవ సంబంధాలు - పెరుగుతున్న విడాకులు

భార్యా భర్తల సంబంధానికి ఒక ప్రత్యేకత ఉన్నది.
అది తల్లీ కొడికుల- తండ్రీ కూతుళ్ళ సంబంధానికి, సోదరీ సోదరుల సంబంధానికి, ఇద్దరు స్నేహితుల (ఆడా మగా)మధ్య సంబంధానికి, ఒక ఆఫీస్ లో పని చేసే ఇద్దరు సహోద్యోగుల మధ్య ఉండే సంబంధానికి పూర్తి గా విభిన్నమైనది.
అసలు ఏ మానవ సత్సంబంధాలకి అయినా మౌలిక మైన సూత్రాలు అవగాహన, సర్దుబాటు, భావోద్వేగాలని అదుపు చేసుకోవటం అనేవి.
ఇవి లేని చోట జీవితం నిత్య సంఘర్షణే. దీనికి తోడు ఆర్ధిక స్వార్ధ కోణాలు కూడా చేరితే ఎలా విడి పోవాలా,ఎలా విడ కొట్టాలా అనే ఆలోచనలే వస్తాయి.
అసలు అత్త స్థానం లో కి వచ్చే తల్లి ఒక విధమైన అభద్రతా భావానికి లోనవటం వల్లనే కోడలి పట్ల ఒక శత్రుత్వ భావన మొదటి నించీ ఏర్పరుచుకుని అందుకు తగ్గట్లే ప్రవర్తించటం వలన సమస్య ప్రారంభం అయి, తరువాత తరువాత జటిలం అవుతుంది.

ఇవి మనము సమాజం లో అనునిత్యం చూసే విషయాలే కాబట్టి, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపించే తల్లి, ముందు గా కూతురికి అత్త అనే వ్యక్తి శత్రువు కాదనీ, తన భర్త కి తల్లి అనీ, ఆమె తన లాగే చిన్నప్పటి నించీ ఎంతో కష్ట పడి, కొడుకు ని పెంచి ఉంటుందని, అనవసర విషయాలలొ ఎక్కువ గా ఊహించుకుని అపార్ధాలు చేసుకొ వద్దని, ఆవిడ పెద్ద వయసు వల్లనో, మరే కారణం వల్లనో కొంత అకారణంగా కోపించినా నేరాలు ఎంచ వద్దనీ, కొంచెం ఓర్పు వహిస్తే సమస్యలు అవే సర్దుకుంటాయని చెప్ప గలిగితే ఎక్కువ భాగం సమస్యా నివారణ జరుగుతుందని తెలుసుకోవాలి.

పెద్దలైన తల్లి దండ్రులు కూడా అత్త మామల స్థానం లో ఉన్నప్పుడు, కోడలి ని తమ ఇంటికి తమ తో జీవితాంతం బతకటానికి వచ్చిన తమ వ్యక్తి గా చూడగలగాలి. తాము చిన్నప్పటి నించీ ఎన్నొ కష్ట నష్టాలకి ఓర్చి పెంచుకున్న కొడుకు ఒక స్థాయి కి చేరాక, ఎక్కడి నించో వచ్చి, కాపు కి వచ్చిన చెట్టు ఫలాలు అనుభవిస్తున్న ఒక విలన్ లా గా చూడటం మానుకోవాలి. మగ పిల్ల వాడికి ఆడ పిల్లతోనే పెళ్ళి చెయ్యాలి, అదీ పరాయి అమ్మ కన్న పిల్లే అయి ఉంటుంది. రేపు మనం కన్న ఆడ పిల్ల ఇంకొక ఇంట్లో అలాంటి స్థానం లో కి వెళుతుంది అని తెలుసుకో గలగాలి.

అటువంటి స్థితి లో ఉన్న తల్లి దండ్రులైతే, నిజం గా కొడుకూ కోడలు విడి పోవటానికి దోహద పడరు.కొడుకుని అందుకు ప్రోత్సహించరు. అంతే కాక వాళ్ళ మధ్య ఏదైనా సమస్య వచ్చి, విడాకులు తీసుకునేతంత ఘర్షణలు పడుతూ ఉంటే వాళ్ళ వంతు గా అవి పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు.

భార్యా భర్తలు అయితే విడాకులు తీసుకుని విడి విడి గా బతికే అవకాశం ఉన్నది కాబట్టి అది ఒక పరిష్కారం గా ఆలోచిస్తున్నారు.అదే ఒక కార్యాలయం లో మన పై అధికారి తో సరి పడక పోతే, మన సహోద్యోగులతో సరి పడక పోతే ఏమి చేస్తున్నాము? విడాకులు తీసుకుని విడి గా వెళ్ళే సౌకర్యం ఉన్నదా? అప్పుడు ఏమి చేస్తున్నాము, సర్దుకు పోవటానికి ప్రయత్నం చెయ్యటం లేదా? రోజుకో ఉద్యోగం మారతామా?
అసలు ఈ కాలం లో మనుషులకి అసహనం చాలా చాలా ఎక్కువ అవుతున్నది. అవతలి వారు తన ఆలోచన సరళి లో లేరు అనుకోగానే వెంటనే ఆ మనిషిని ఎలా అంతం చెయ్యాలి అనేటంత తీవ్ర ధోరణి లో కి వెళ్ళి పోతున్నారు. దానికి తల్లి దండ్రులనీ వెనకాడటం లేదు. మరే బంధమనీ చూడటం లేదు.
ఈ పరిస్థితికి కారణం, ముఖ్యం గా పిల్లలకి(ఆడ కానీ మగ కానీ) చిన్నప్పటి నించీ సహనం, సహజీవన మాధుర్యం గురించి మన పెద్దలు చెప్పినట్లు నీతి కధల లాగా చెప్పే ప్రయత్నం చెయ్యటం లేదు. జీవితం యాంత్రికమై పోయింది. ఎవరితో ఎవరు మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఉండటం లేదు.సమస్యలు కుటుంబ సభ్యులతో పంచుకునే వసతి ఉండటం లేదు. భావోద్వేగాలనేవి అందరు ఏదో ఒక సందర్భం లో అనుభవించేవె. మనకి సమస్య వచినప్పుడు నిస్సంకోచం గా తల్లి దండ్రులతో చర్చించటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనసు కొంచెం తేలిక పడుతుంది. వెంటనే అప్పటికప్పుడు నిర్నయం తీసుకుంటే, అది ఎప్పుడూ తప్పు దారి లోనే వెళుతుంది అని తెలుసుకో గలగాలి. మనో నిబ్బరం, ఓర్పు నెర్చుకుంటే ఎప్పుడైనా ఏ విషయ మైనా నష్టాన్ని నివారించవచ్చు అని తెలుసుకోవటానికి మన చదువుని, మన చుట్టూ సమాజం లో గమనిస్తున్న వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఉపయోగించుకోవటం అలవాటు చేసుకోవాలి.
ఇవన్నీ చాలనట్లు జీవితం లో వ్యాపార ధోరణి ఎక్కువ అయింది. అన్నిటికీ లాభ నష్టాల బేరీజులే. ఇంట్లో పెద్దలతో కలిసి బతకాల్సిన అవసరం, దానికి కావలసిన మానసిక సర్దుబాటు ధోరణి, పెద్దల పట్ల సానుభూతి ధొరణి నేర్చుకోగలిగితే సగం సమస్యలు పరిష్కరించుకున్నట్లే.
మనుషులు చదువు ని, ప్రపంచం నించి తెలుసుకున్న విషయాలని జీవితం లో అన్వయించుకోవాలనుకుంటే పరిష్కారాలు అవే దొరుకుతాయి. విషయం వినగానే, అది అవతలి వారు అయితే సానుభూతి చూపిస్తాము కానీ అదే తన భార్య/భర్త విషయం అయితే ఆ ద్రుష్టి లో చూడలేకపోవటమే సమస్యలకి మూలం.
వెతికితే పరిష్కారం దొరకని సమస్యలు అనేవి ఉండవు.
మన ద్రుఢమైన కుటుంబ వ్యవస్థ వైపు మెచ్చుకోలు గా పాశ్చాత్య దేశాలు చూస్తుంటే, మనము వారి విశ్రుంఖల స్వేచ్చా స్వాంతంత్ర్యాలని మెచ్చుకునే స్థితి లో కి వెళుతున్నాము.
పొరుగింటి పుల్ల కూర రుచేమో.

Tuesday, February 2, 2010

వ్యవసాయ భూముల క్షోభ - సరళీకృత ఆర్ధిక విధానాలు

ఇప్పటికీ భారత దేశం లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు అందుకు అనుగుణం గా ఉండాలి అనేది ఒక సర్వ సాధారణ అవసరం.
కానీ మన ప్రభుత్వం అందుకు విరుద్ధం గా, సరళీకృత ఆర్ధిక విధానం పేరిట వ్యవసాయ భూములని వ్యవసాయేతర కార్యకలాపాలైన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి, పారిశ్రామిక మండళ్ళకి కేటాయించి ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ఒక పధ్ధతి
ప్రకారం దెబ్బ కొడుతున్నది. రైతులు ఎంత తమ అ యిష్ట త ని, అసహనాన్ని ఉద్యమ రూపం గా వ్యక్త పరిచినా ప్రభుత్వం పట్టించు కో దాల్చుకున్నట్లు లేదు.
గత పదిహేను ఇరవై సంవత్సరాలు గా, లాభ సాటి గా ఉంటుంది అనే మిష తో కోస్త్రాంధ్ర లో చాలా వ్యవసాయ భూములని చేపల చెరువులు గా మార్చి ఆ భూమి ని పంటలు పండించటానికి అ యోగ్యం గా మార్చారు. చేపల చెరువు గా మార్చబడిన పొలం మళ్ళీ ఏమి చేసినాఆహారధాన్యాలు పండించటానికి పనికి రాదు.
చేపల సాగు విధానం పూర్తిగా వేరు కాబట్టి భూమి తన సహజమైన సారాన్ని కోల్పోతుంది.
పర్యావరణంకాలుష్యం పేరు చెప్పి, తెగులు సోకి అధిక సంఖ్యా లో చేపలు రొయ్యలు చని పోయి నష్టం వాటిల్లుతున్నదనీ ఆ పొలాలని రైతులు ఇళ్ళ స్థలాలుగా మార్చి తమ నష్టాన్ని భర్తీ చేసుకున్నారు.
ఈ విధంగా చక్కటి నీటి వసతి ఉన్ డీ , సారవంత మై ఆహార ధాన్యాలు పండిం చ గలిగిన భూమి ని కొంత నష్ట పోయాము. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ భూములని సేకరించి ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి (బడా వ్యాపార వేత్తలకి లాభం చేకుర్చతానికి )కేటాయించా టానికి ప్రయత్నించటం రైతుల పాలిత మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందం గా ఉన్నది.
ఈ విధం గా రాను రాను ఆహార ధాన్యాలు పండించే భూములన్నీ సర్కార్ వారి పుణ్యమా ని కొంతా, లాభాల దృష్టి తో కొంతా హరించుకు పొతే కేవలం తిండి గింజల కోసం కుడా బయటి దేశాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందేమో. మన పాలకుల కోరిక కుడా అదేనేమో.
ఆకలి వేస్తెమౌలికం గా తిన వలసినది అన్నం కానీ రొట్టె కానీ. ఆదరువు గా తినే చేపలూ కాదు, పారిశ్రామికం గా ఉత్పత్తి అయిన వస్తువులు కాదు.
సారవంతమైన భూమి లేక పొతే ఎవరము ఏమి చెయ్యలేము, లేదా భూమి ఉన్ డీ నీటి వసతి లేక పోయినా ఏమి చెయ్యలేము.
ఇక్కడ అన్నీ ఉన్ డీ సర్కార్ విధానాల వలన రైతు నోట్లో ను, భారత పౌరుల నోట్లోను మట్టి కొడుతున్నారు.
మద్దతు ధర ఇచ్చి రైతుని ప్రోత్సహించటం, రైతుని బతికించటం బాద్య త అని అనుకోవటం లేదు.
సమయానికి విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసి ప్రక్రుతి ఆధారిత రంగాన్ని ఆదుకోవాలని అనుకోవటం లేదు.
అగ్ర దేశాలు సబ్సిడీలు రైతులకి తీసేయ్యమన్నారు కాబట్టి వెంటనే అమలు పరిచారు.
కొత్త రంగాలని అభివృద్ధి చెయ్యటానికి ఉన్న వనరులన్నీమళ్ళించి, వీలు అయితే సంక్షేమం అంటా మట్టి కలిపి , బోలెడంత కాలం వృధా చెయ్యటానికి సిద్ధ పడుతున్నారు కానీ, ఉన్న దాన్ని సంరక్షించి మేలు చెయ్యాలని అనుకోవటం లేదు.
ఆర్ధిక విధానాలలో భాగం గా ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గించాలి అని మనలని శాసిస్తున్న అగ్ర రాజ్యం (ప్రపంచ బ్యాంకుద్వారా )తమ రంగాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని (ఆర్ధిక ఉద్దీపన పేరు చెప్పి) అంతకంతకీ పెంచుతున్నది.
అగ్ర దేశాలు ఏమి శాసిస్తే దానికి తందానా తాన అనటమే పరిపాలనా ?
ఇది నవీన కాలపు సంక్షేమమా ?

Wednesday, January 20, 2010

అవినీతికి పట్టం

దేశం లో అభివ్రుది పేరు చెప్పి ఫ్లై ఓవర్ లు కట్టటం మొదలు పెట్టినప్పటి నించీ ఏలిన వారి తాలూకు కాంట్రాక్టర్ ల కి పండగే పండగ.

రెండు సంవత్సరాలక్రితం హైదరాబాద్ లో ని పంజాగుట్ట లో నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ నిట్టనిలువు గా కూలిపోయి దారిన పోయే వారు దాని కింద పది ప్రాణాలు పోగొట్టు కుంటే, సహాయక చర్యలు చేపట్టిన దాని కంటే వేగం గా ఆ కాంట్రాక్టర్ ని కాపాడటానికి సర్కారు ప్రయత్నం చేసింది.

దాన్ని ప్రజలు ఇంకా మర్చి పోక ముందే డిల్లీ లో మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం లో పిల్లర్ ల లో పగుళ్ళు, నాసి రకం పనులు అని వార్తా.

అక్కడా ఇక్కడా కుడా కాంట్రాక్టర్ లు గామన్ కంపనీ వాళ్ళే. వాళ్ళ గురించి సామాన్య మానవులు, బాధితులు మాట్లాడే లోపే, ఈ కంపనీ చాలా పెద్దది, అంతర్జాతీయం గా కుడా అనేక ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం ఉన్నది అని సర్కారు వారు వాళ్ళని భుజాన వేసుకుని సమర్ధించటం మొదలు పెట్టారు.

అప్పుడే ప్రజలకి అర్ధం అయి ఉండాలి, వీళ్ళ మీద ఎ విధమైన చర్యలు తీసుకోరని, మళ్ళీ కొత్త కాంట్రాక్టులు వీళ్ళకే కట్టబెదతారని . ఇప్పుడు అదే జరిగింది. నిర్మాణ పనులకి అర్హత సంపాదించాలంటే కనీసం కొన్ని కూలి పోవాలని, కొంత మంది ని వాటికి బలి చెయ్యాలని, అదే ప్రమాణాన్ని నిర్ణయించే విధానమని సర్కార్ నిరూపించింది.

దీన్ని సంక్షేమం అంటారా ?

కంచే చేను మేస్తే, కాపాడేది ఎవరు?

వేలు లక్షలు పన్నులు కట్టి, ప్రభుత్వాలని కట్ట పెట్టి న సామాన్య ప్రజల ఇంటరెస్ట్ ల ని వీరు అలివి మాలిన అవినీతికి తాకట్టు పెట్టారనుకోవచా?

తెలుగు వారి అన్న గారి వర్ధంతి

అన్న గారిని తలచు కుంటే ప్రతీ తెలుగు వాడికి ఓడలు పులకరిస్తుంది అంటే అతిశయోక్తి (పౌరాణిక పాత్ర ల కి సంబందినంత వరకు ) కాదేమో.
కానీ తెలుగు ఆత్మా గౌరవానికి సంబంధించినంత వరకు నా అనుభవం పది మందితో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను.
నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో గుజరాత్ వెళ్ళటం జరిగింది. అక్కడ గ్రామీణ ప్రాంతాల లో గుజరాతీ భాష తప్ప హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవ్వరు మాట్లాడరు. నన్ను వాళ్ళు ఎక్కడి నించి వచారు అని అడిగారు. నేను ఆంద్ర ప్రదేశ్ అని చెప్పగానే, ఓహో ఎన్టీ రామా రావు గారి రాష్ట్రమా అని అడిగే టప్పటికి నాకు చాల ఆశ్చర్యం వేసింది. నేను వెళ్ళిన చోట విద్య, లోక జ్ఞానం, సామాన్య విషయ అవగాహన చాలాచాలా తక్కువగా నేను గ్రహించాను. అలాంటి చోట వాళ్ళు ఆయన గురించి ప్రస్తావించి, మమ్మల్ని ఆ రాష్ట్రం వారిగా చూడటం ఎంతోగొప్ప గా అనిపించింది.
అదీ ఆయన ప్రభావం అని తెలుసుకుని మేము ఆశ్చర్యం తో కూడిన సంతోషం అనుభవిన్చాము
ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న స్థితి తెలుసుకుంటే ఆయన ఆత్మా ఘోశిస్తుందేమో.

Saturday, January 16, 2010

ప్రజాస్వామ్యం - వ్యక్తిగత హక్కులు

శాంతి భద్రతలని రక్షించి మనకి ప్రశాంతమైన జీవితాలని అందించే ఒక ఉన్నత స్థాయి అధికారి కి ఒక విషయం గురించి వ్యక్తీ గత స్థాయి లో కానీ, సాంకేతిక పరంగా కానీ, పూర్వ అనుభవం తో కానీ వ్యాఖ్యానించే అర్హత, అధికారం, స్వేఛలేవు. వారి అభిప్రాయాలని నిస్సంకోచం గా నిర్భీతి గా వ్యక్త పరిచే అవకాశంప్రజాస్వామ్యం లో లేదనిమన రాజకీయ నాయకులు నిరూపిస్తున్నారు.

డీజీపీ గిరీష్ కుమార్ గారు ఒక బాధ్యతా గల ఉద్యోగి. ఒక ఉన్నత స్థాయి అధికారి. శాంతి భద్రతల సంరక్షణ లో అనుభవం ఉన్న వ్యక్తీ. ఆయనేమి ఒక రాజకీయ నాయకుడు కాదు. ఏదో పబ్బం గడుపుకోవటానికి ఏదో ఒక వ్యాఖ్య చెయ్యటానికి. ఎంత సమర్ధత ఉన్నా, ఎన్ని అర్హతలు ఉన్నా వారి ఇష్టం వచినట్లు వ్యవహరించటానికి వారికీ నియమాలు, పరిమితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తీ రూపొందించే రిపోర్ట్ లు కొంత సాంకేతికం గాను, పూర్వ అనుభవం తో నూ ఉంటాయే కానీ వారికి రాజకీయ ఎత్తుగడల అవసరం ఏముంటుంది?

పదే
పదే వారి వ్యాఖ్యలని ఉప సంహ రించుకోమని రాజకీయ నాయకులు కోరటం ఏ ప్రజా స్వామ్యానికి నిదర్సనం? ఏ అర్హత (కేవలం రాజకీయ కేళి లో నెగ్గి ) (క్షమించాలి ఈ మాట అంటున్నందుకు ) లేకుండా, నిపుణులైన వారి సేవలని సకుటుంబం గా అనుభవిస్తూ వాళ్ళని చిన్న పెద్ద మాటలంటూ
వారి సంరక్షణ లో నే రోజు వారీ జీవితాన్ని ప్రశాంతంగా నెట్టుకొస్తున్న ఈ రాజకీయ నాయకులు ఆగడాలు మన ప్రజా స్వామ్యం లో నే అనుకుంటే మనము సిగ్గు పడాలేమో

ఈ ప్రజలేటు పొతే నాకేం అని వాళ్ళు ఒక్క క్షణం విశ్రమిస్తేమన దైనందిన జీవితాలు ఈ రాజకీయ నాయకుల స్వార్ధ కేళి లో గుండె దుడుకు గా నడవ వలసినవే.

సామాన్య ప్రజలకి వీసమెత్తు ఉపయోగ పాడనీ ఈ రాజాకీయ నాయకుల వ్యక్తీ గత దూషణలు, ఆవేసపు వ్యాఖ్యలు ఉపసంహరించు కోమని, ఉద్యమించి విజయం సాధించ గల రోజు ఎప్పుడు వస్తుందో కదా.

ఇలా మనకి నచని ప్రతి వ్యాఖ్య ని ఉపసంహ రించుకోమని వత్తిడి చేస్తే మన ప్రియతమా నాయకుడు కేసీఆర్ ప్రతి రోజు ప్రతి మాటని తూకం వేసి నోరు సంబాలించుకుని మాట్లాడాలి. ఆ మాట కొస్తే ఏ రాజకీయ నాయకుడు వివాదాలకతీతం గా మాట్లాడుతున్నారు?

రాజకీయ నాయకుల కి ఉన్న వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీ గత స్వేఛ వాళ్ళని అను నిత్యం కాపాడుతున్న అధికారులకి నిపుణుల కి లేక పోవటం శోచనీయం.

అందరు ఉన్నత స్థాయి అధికారులు ఒకే విధం గా ఏ ఎండా కి ఆ గొడుగు పడతారు అనుకుంటే పొరబాటే. వాళ్ళ ప్రత్యెక విషయ పరిధి లో కి సామాన్యులు చోచుకు పొతే సామాన్య మానవుడి కి అందే సేవల లో నాణ్యత తగ్గి తీరుతుంది. అందుకే ఎవరి పని వాళ్ళని చేసుకో నివ్వాలి.