Wednesday, September 1, 2010

నేటి తరం పిల్లల భావాలు -పిచ్చా పాటి గా

నిన్న నేను పేపర్ చదువుతూ వ్యాపార ప్రకటనల పుణ్యమా అని తల్లి అనే వ్యక్తి,అచ్చం ప్రకటనల్లో చూపించినట్లు, ఎలా ఉండాలని తాము కోరుకుంటున్నారో చెప్పిన పిల్లల (15-16సంవత్సరాల వయసు ఉన్న)భావాలు చదివి ఆశ్చర్య పోయాను.

బట్టలు నలగకుండా, జుట్టు చెరగకుండా, మొహం లో అలసట కనిపించకుండా సదా మీ సేవ లో అనేట్లు కనిపిస్తూ అత్యంత ఆదర్శ వంతం గా, ఆధునికం గా, ఆంగ్ల భాషని అనర్గళం గా మాట్లాడుతూ, ఎప్పుడు ఫ్రెష్ గా చిరు నవ్వు నవ్వుతూ, పిల్లలని అస్సలు కోప్పడకుండా ఉండాలని నేటి తరం పిల్లలు కోరుకుంటున్నారని తెలిసి ఒకింత నిర్ఘాంత పోయాను.

ఈ పిల్లలకి తండ్రుల పట్ల పెద్ద గా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవుట.

బాగుంది వినటానికి. ఎందుకంటే మన సనాతన ధర్మం ముందే స్త్రీ (గ్రుహిణి కూడా అనుకోవచ్చు) కి ఉండవలసిన లక్షణాలని ఆరు విధాలుగా నిర్వచించింది. అవి "కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ" అని. మరి నేటి తరం పిల్లలకి కూడా తల్లుల పట్లే నిర్దుష్టమైన అభిప్రాయాలు, కోరికలు. తండ్రులకి మినహాయింపు ఇచ్చేశారు.

కానీ ఆ సదరు పత్రిక ప్రతినిధులు, మరి మీ తల్లి దండ్రుల కోరిక ప్రకారం మీరు నడుచుకోగలరా అని ప్రశ్నించలేదు. అలాగే, ఇవ్వాళ్టి రోజున మిమ్మల్ని తీర్చి దిద్ది మీ అవసరాలు అన్నీ తీర్చిన తల్లిదండ్రులని వ్రుద్ధాశ్రమాలకి పంపించటం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగి ఉంటే ఏమి జవాబు చెప్పే వారో?

తల్లి పాత్రని వ్యాపార ప్రకటనలు నిర్ణయించటం ఎంత బాధాకరము!

ప్రకటనల్లొ, అర్ధ రాత్రి వరకు చదువుకుంటూ ఉండే పిల్ల/పిల్ల వాడికి తల్లి ఫ్రెష్ గా చెదరని చిరునవ్వుతో ఏదో ఒక హెల్త్ డ్రింక్ తెచ్చి ఇస్తుంది.

చదువుకునే పిల్లల అవసరాలు తల్లి తీర్చవలసిందే. కానీ తెల్లారి లేస్తే అనేక సమస్యలతో ఇంటా, బయటా సతమతమవుతున్న నేటి మహిళ, ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఇలా ప్రకటనల్లొ చూపించినట్లు, ఉన్న ఇద్దరో, ముగ్గురో పిల్లలకి ఎప్పుడు అవసరం వస్తె అప్పుడు చిరునవ్వులతో సేవ చెయ్యటం సాధ్యమేనా? అని పిల్లలు అలోచించేట్లు చెయ్యగలిగితె బాగుంటుందేమో కదా.

మన కోరికలు, ఆదర్శాలు అవతలి వ్యక్తులకి మాత్రమే చెందిన విషయమని, అందుకు అనుగుణం గా మనం ఏమి మారక్కరలేదని,పిల్లలు అనుకోకూడదు. అదేదో "ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అన్నట్లు ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు, తోటి కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత, పెద్ద తరం వాళ్ళ పట్ల సానుభూతి,ప్రేమ,కుటుంబం లో మన పాత్ర తెలుసుకునే అవకాశం పూర్వం ఉమ్మడి కుటుంబాలలోసహజం గా ఉండేది.నేడు అది క్రమంగా సన్నగిల్లి పోతున్నది.కుటుంబం లో ఎవరి పాత్రకి ఉండే పరిధులు వారికి ఉంటాయని, అందరూ వాటిని గౌరవించాలని, మన అవసరాలని,ప్రవర్తనని ఆ పరిధిలో ఇముడ్చుకోవాలనీ పిల్లలకి సులభం గా తెలిసేది.

పిల్లలకేమి తెలుసు పాపం, వాళ్ళు మైనం ముద్దల లాంటి వాళ్ళు, ఏ మూస లో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటారు.

ఈవ్యాపార ప్రకటనలు (అన్నీ అనను కానీ)ఏదో నేల ని విడిచి ఆకాశం లో విహరించటం లాగా ఉంటున్నాయి.
నిష్టూరం గానూ, చేదు గానూ ఉండే నిజాలని భరించే శక్తి ని ఏ వ్యాపార ప్రకటన అయినా ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళకి కావలసింది డబ్బు సంపాదించుకోవటానికి కావలసిన మాటల చేతల ఇంద్ర జాలం.


పిల్లలందరూ నేల విడిచి సాము చేస్తున్నారు అని కాదు నా భావం.కానీ ద్రుశ్య మాధ్యమానికి ఉన్న శక్తిని అత్యంత నేర్పు గా డబ్బు చేసుకోవటానికి పిల్లలని మాధ్యమంగా వాడుకుంటున్న వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్న పిల్లల సంగతే నేను చెప్పదల్చుకున్నది.

సమాజం లొ మార్పులు వేగం గా వస్తున్నాయి.ప్రతి సమస్య కుటుంబ స్థాయి లో ఏర్పడి తరువాత సామాజిక స్థాయికి విస్తరిస్తున్నది.

అందువల్ల పిల్లలకి బాధ్యతలు, వాళ్ళ వంతు పాత్ర పట్ల అవగాహన, సర్దుబాటు తత్వం ప్రయత్న పూర్వకం గా నేర్పాలి.

అలా అవి తెలియక పోవటం వల్లనేపిల్లలుఇప్పుడు ఈజీ గోయింగ్ ధోరణి లో ఉంటూ, అదే సరి అయిన పద్ధతి అనుకుంటున్నారు. కొండ మీది కోతి కావాలి, అది దొరక్క పోతే ఆత్మ హత్య ఒక్కటే శరణ్యం అనే విపరీత పోకడలకి పోతున్నారు.

మానసికం గా బలహీనులు అవుతున్నారు. తాము జీవితం నష్ట పోతూ తల్లి దండ్రులని కూడా క్షోభ పెడుతున్నారు.

మన దేశం లో పిల్లలని పెంచే తీరుకు, పాశ్చాత్య దేశాల్లో పిల్లలని పెంచే తీరు కి మౌలికమైన తేడా ఉన్నది.

పిల్లల్లో అంతర్లీనం గా ఉండే అద్భుత శక్తి చైతన్యం పదును పెడితేనే వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణిస్తారు అని మనము నమ్ముతాము. అందుకోసం అవసరమైతే మనము కొంచెం కఠినం గా పిల్లలతో వ్యవహరిస్తాము (కనీసం నటిస్తాము). వాళ్ళేమి మనకు శత్రువులు కాదు కదా. వాళ్ళల్లో అంతర్గతం గా ఉండే డైనమిక్ ఎనర్జీ ని వెలికి తీసే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం చిన్నప్పటి నించి శిక్షణా విధానం లొ చొప్పిస్తాము. కోరుకున్నవన్నీ పొందాలంటే - కష్టపడాలనీ, ఏదీ ఆయాచితం గా దొరకదనీ చిన్నప్పటి నించీ నేర్పుతాము. వ్యామోహాలు మంచివి కాదనీ, నిగ్రహ శక్తి అవసరమనీ చెబుతాము.

ఈ ప్రకటనలని తయారు చేసే వాళ్ళు కేవలం మార్కెటింగ్ టెక్నిక్ లు అనుసరిస్తూ, మనసుని ఆకట్టుకునే ధోరణిలొ,పర్యవసానాలు ఊహించని పోకడలకి పోతున్నారు.

దాని వల్ల పాశ్చాత్యపు ప్రభావం మన పిల్లల తరం మీద చాలా బలం గా పడుతున్నది.
తల్లి దండ్రులు, కుటుంబ విలువలు అనేవి అర్ధం లేని మాటలు గా తోచటం వల్లనే ఇవ్వాళ్ళ ఇన్ని ఒంటరి తల్లి దండ్రుల జీవితాలు, వ్రుద్ధాశ్రమాల ఉనికి - విస్తరణకి అవకాశం ఏర్పడింది.

అది ఒక సామాజిక అంశం అయింది.

తల్లులు ఆదర్శం గా ఉండాలి అని పిల్లలు కోరుకోవటం అనే ఒక్క విషయం మీద ఈవిడ ఇంత ఘాటుగా స్పందించిందేమిటి అనుకోకండి, ఏ సమస్య అయినా చిన్న గానే మొదలవుతుంది, అది తీవ్ర రూపం దాల్చినప్పుడే పది మంది ద్రుష్టి లో పడుతుంది. కాదంటారా!

No comments:

Post a Comment