Sunday, February 7, 2010

పలుచ బడుతున్న మానవ సంబంధాలు - పెరుగుతున్న విడాకులు

భార్యా భర్తల సంబంధానికి ఒక ప్రత్యేకత ఉన్నది.
అది తల్లీ కొడికుల- తండ్రీ కూతుళ్ళ సంబంధానికి, సోదరీ సోదరుల సంబంధానికి, ఇద్దరు స్నేహితుల (ఆడా మగా)మధ్య సంబంధానికి, ఒక ఆఫీస్ లో పని చేసే ఇద్దరు సహోద్యోగుల మధ్య ఉండే సంబంధానికి పూర్తి గా విభిన్నమైనది.
అసలు ఏ మానవ సత్సంబంధాలకి అయినా మౌలిక మైన సూత్రాలు అవగాహన, సర్దుబాటు, భావోద్వేగాలని అదుపు చేసుకోవటం అనేవి.
ఇవి లేని చోట జీవితం నిత్య సంఘర్షణే. దీనికి తోడు ఆర్ధిక స్వార్ధ కోణాలు కూడా చేరితే ఎలా విడి పోవాలా,ఎలా విడ కొట్టాలా అనే ఆలోచనలే వస్తాయి.
అసలు అత్త స్థానం లో కి వచ్చే తల్లి ఒక విధమైన అభద్రతా భావానికి లోనవటం వల్లనే కోడలి పట్ల ఒక శత్రుత్వ భావన మొదటి నించీ ఏర్పరుచుకుని అందుకు తగ్గట్లే ప్రవర్తించటం వలన సమస్య ప్రారంభం అయి, తరువాత తరువాత జటిలం అవుతుంది.

ఇవి మనము సమాజం లో అనునిత్యం చూసే విషయాలే కాబట్టి, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపించే తల్లి, ముందు గా కూతురికి అత్త అనే వ్యక్తి శత్రువు కాదనీ, తన భర్త కి తల్లి అనీ, ఆమె తన లాగే చిన్నప్పటి నించీ ఎంతో కష్ట పడి, కొడుకు ని పెంచి ఉంటుందని, అనవసర విషయాలలొ ఎక్కువ గా ఊహించుకుని అపార్ధాలు చేసుకొ వద్దని, ఆవిడ పెద్ద వయసు వల్లనో, మరే కారణం వల్లనో కొంత అకారణంగా కోపించినా నేరాలు ఎంచ వద్దనీ, కొంచెం ఓర్పు వహిస్తే సమస్యలు అవే సర్దుకుంటాయని చెప్ప గలిగితే ఎక్కువ భాగం సమస్యా నివారణ జరుగుతుందని తెలుసుకోవాలి.

పెద్దలైన తల్లి దండ్రులు కూడా అత్త మామల స్థానం లో ఉన్నప్పుడు, కోడలి ని తమ ఇంటికి తమ తో జీవితాంతం బతకటానికి వచ్చిన తమ వ్యక్తి గా చూడగలగాలి. తాము చిన్నప్పటి నించీ ఎన్నొ కష్ట నష్టాలకి ఓర్చి పెంచుకున్న కొడుకు ఒక స్థాయి కి చేరాక, ఎక్కడి నించో వచ్చి, కాపు కి వచ్చిన చెట్టు ఫలాలు అనుభవిస్తున్న ఒక విలన్ లా గా చూడటం మానుకోవాలి. మగ పిల్ల వాడికి ఆడ పిల్లతోనే పెళ్ళి చెయ్యాలి, అదీ పరాయి అమ్మ కన్న పిల్లే అయి ఉంటుంది. రేపు మనం కన్న ఆడ పిల్ల ఇంకొక ఇంట్లో అలాంటి స్థానం లో కి వెళుతుంది అని తెలుసుకో గలగాలి.

అటువంటి స్థితి లో ఉన్న తల్లి దండ్రులైతే, నిజం గా కొడుకూ కోడలు విడి పోవటానికి దోహద పడరు.కొడుకుని అందుకు ప్రోత్సహించరు. అంతే కాక వాళ్ళ మధ్య ఏదైనా సమస్య వచ్చి, విడాకులు తీసుకునేతంత ఘర్షణలు పడుతూ ఉంటే వాళ్ళ వంతు గా అవి పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు.

భార్యా భర్తలు అయితే విడాకులు తీసుకుని విడి విడి గా బతికే అవకాశం ఉన్నది కాబట్టి అది ఒక పరిష్కారం గా ఆలోచిస్తున్నారు.అదే ఒక కార్యాలయం లో మన పై అధికారి తో సరి పడక పోతే, మన సహోద్యోగులతో సరి పడక పోతే ఏమి చేస్తున్నాము? విడాకులు తీసుకుని విడి గా వెళ్ళే సౌకర్యం ఉన్నదా? అప్పుడు ఏమి చేస్తున్నాము, సర్దుకు పోవటానికి ప్రయత్నం చెయ్యటం లేదా? రోజుకో ఉద్యోగం మారతామా?
అసలు ఈ కాలం లో మనుషులకి అసహనం చాలా చాలా ఎక్కువ అవుతున్నది. అవతలి వారు తన ఆలోచన సరళి లో లేరు అనుకోగానే వెంటనే ఆ మనిషిని ఎలా అంతం చెయ్యాలి అనేటంత తీవ్ర ధోరణి లో కి వెళ్ళి పోతున్నారు. దానికి తల్లి దండ్రులనీ వెనకాడటం లేదు. మరే బంధమనీ చూడటం లేదు.
ఈ పరిస్థితికి కారణం, ముఖ్యం గా పిల్లలకి(ఆడ కానీ మగ కానీ) చిన్నప్పటి నించీ సహనం, సహజీవన మాధుర్యం గురించి మన పెద్దలు చెప్పినట్లు నీతి కధల లాగా చెప్పే ప్రయత్నం చెయ్యటం లేదు. జీవితం యాంత్రికమై పోయింది. ఎవరితో ఎవరు మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఉండటం లేదు.సమస్యలు కుటుంబ సభ్యులతో పంచుకునే వసతి ఉండటం లేదు. భావోద్వేగాలనేవి అందరు ఏదో ఒక సందర్భం లో అనుభవించేవె. మనకి సమస్య వచినప్పుడు నిస్సంకోచం గా తల్లి దండ్రులతో చర్చించటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనసు కొంచెం తేలిక పడుతుంది. వెంటనే అప్పటికప్పుడు నిర్నయం తీసుకుంటే, అది ఎప్పుడూ తప్పు దారి లోనే వెళుతుంది అని తెలుసుకో గలగాలి. మనో నిబ్బరం, ఓర్పు నెర్చుకుంటే ఎప్పుడైనా ఏ విషయ మైనా నష్టాన్ని నివారించవచ్చు అని తెలుసుకోవటానికి మన చదువుని, మన చుట్టూ సమాజం లో గమనిస్తున్న వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఉపయోగించుకోవటం అలవాటు చేసుకోవాలి.
ఇవన్నీ చాలనట్లు జీవితం లో వ్యాపార ధోరణి ఎక్కువ అయింది. అన్నిటికీ లాభ నష్టాల బేరీజులే. ఇంట్లో పెద్దలతో కలిసి బతకాల్సిన అవసరం, దానికి కావలసిన మానసిక సర్దుబాటు ధోరణి, పెద్దల పట్ల సానుభూతి ధొరణి నేర్చుకోగలిగితే సగం సమస్యలు పరిష్కరించుకున్నట్లే.
మనుషులు చదువు ని, ప్రపంచం నించి తెలుసుకున్న విషయాలని జీవితం లో అన్వయించుకోవాలనుకుంటే పరిష్కారాలు అవే దొరుకుతాయి. విషయం వినగానే, అది అవతలి వారు అయితే సానుభూతి చూపిస్తాము కానీ అదే తన భార్య/భర్త విషయం అయితే ఆ ద్రుష్టి లో చూడలేకపోవటమే సమస్యలకి మూలం.
వెతికితే పరిష్కారం దొరకని సమస్యలు అనేవి ఉండవు.
మన ద్రుఢమైన కుటుంబ వ్యవస్థ వైపు మెచ్చుకోలు గా పాశ్చాత్య దేశాలు చూస్తుంటే, మనము వారి విశ్రుంఖల స్వేచ్చా స్వాంతంత్ర్యాలని మెచ్చుకునే స్థితి లో కి వెళుతున్నాము.
పొరుగింటి పుల్ల కూర రుచేమో.

Tuesday, February 2, 2010

వ్యవసాయ భూముల క్షోభ - సరళీకృత ఆర్ధిక విధానాలు

ఇప్పటికీ భారత దేశం లో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు అందుకు అనుగుణం గా ఉండాలి అనేది ఒక సర్వ సాధారణ అవసరం.
కానీ మన ప్రభుత్వం అందుకు విరుద్ధం గా, సరళీకృత ఆర్ధిక విధానం పేరిట వ్యవసాయ భూములని వ్యవసాయేతర కార్యకలాపాలైన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి, పారిశ్రామిక మండళ్ళకి కేటాయించి ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ఒక పధ్ధతి
ప్రకారం దెబ్బ కొడుతున్నది. రైతులు ఎంత తమ అ యిష్ట త ని, అసహనాన్ని ఉద్యమ రూపం గా వ్యక్త పరిచినా ప్రభుత్వం పట్టించు కో దాల్చుకున్నట్లు లేదు.
గత పదిహేను ఇరవై సంవత్సరాలు గా, లాభ సాటి గా ఉంటుంది అనే మిష తో కోస్త్రాంధ్ర లో చాలా వ్యవసాయ భూములని చేపల చెరువులు గా మార్చి ఆ భూమి ని పంటలు పండించటానికి అ యోగ్యం గా మార్చారు. చేపల చెరువు గా మార్చబడిన పొలం మళ్ళీ ఏమి చేసినాఆహారధాన్యాలు పండించటానికి పనికి రాదు.
చేపల సాగు విధానం పూర్తిగా వేరు కాబట్టి భూమి తన సహజమైన సారాన్ని కోల్పోతుంది.
పర్యావరణంకాలుష్యం పేరు చెప్పి, తెగులు సోకి అధిక సంఖ్యా లో చేపలు రొయ్యలు చని పోయి నష్టం వాటిల్లుతున్నదనీ ఆ పొలాలని రైతులు ఇళ్ళ స్థలాలుగా మార్చి తమ నష్టాన్ని భర్తీ చేసుకున్నారు.
ఈ విధంగా చక్కటి నీటి వసతి ఉన్ డీ , సారవంత మై ఆహార ధాన్యాలు పండిం చ గలిగిన భూమి ని కొంత నష్ట పోయాము. ఇది చాలదన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ భూములని సేకరించి ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకి (బడా వ్యాపార వేత్తలకి లాభం చేకుర్చతానికి )కేటాయించా టానికి ప్రయత్నించటం రైతుల పాలిత మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందం గా ఉన్నది.
ఈ విధం గా రాను రాను ఆహార ధాన్యాలు పండించే భూములన్నీ సర్కార్ వారి పుణ్యమా ని కొంతా, లాభాల దృష్టి తో కొంతా హరించుకు పొతే కేవలం తిండి గింజల కోసం కుడా బయటి దేశాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందేమో. మన పాలకుల కోరిక కుడా అదేనేమో.
ఆకలి వేస్తెమౌలికం గా తిన వలసినది అన్నం కానీ రొట్టె కానీ. ఆదరువు గా తినే చేపలూ కాదు, పారిశ్రామికం గా ఉత్పత్తి అయిన వస్తువులు కాదు.
సారవంతమైన భూమి లేక పొతే ఎవరము ఏమి చెయ్యలేము, లేదా భూమి ఉన్ డీ నీటి వసతి లేక పోయినా ఏమి చెయ్యలేము.
ఇక్కడ అన్నీ ఉన్ డీ సర్కార్ విధానాల వలన రైతు నోట్లో ను, భారత పౌరుల నోట్లోను మట్టి కొడుతున్నారు.
మద్దతు ధర ఇచ్చి రైతుని ప్రోత్సహించటం, రైతుని బతికించటం బాద్య త అని అనుకోవటం లేదు.
సమయానికి విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసి ప్రక్రుతి ఆధారిత రంగాన్ని ఆదుకోవాలని అనుకోవటం లేదు.
అగ్ర దేశాలు సబ్సిడీలు రైతులకి తీసేయ్యమన్నారు కాబట్టి వెంటనే అమలు పరిచారు.
కొత్త రంగాలని అభివృద్ధి చెయ్యటానికి ఉన్న వనరులన్నీమళ్ళించి, వీలు అయితే సంక్షేమం అంటా మట్టి కలిపి , బోలెడంత కాలం వృధా చెయ్యటానికి సిద్ధ పడుతున్నారు కానీ, ఉన్న దాన్ని సంరక్షించి మేలు చెయ్యాలని అనుకోవటం లేదు.
ఆర్ధిక విధానాలలో భాగం గా ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గించాలి అని మనలని శాసిస్తున్న అగ్ర రాజ్యం (ప్రపంచ బ్యాంకుద్వారా )తమ రంగాలలో ప్రభుత్వ ప్రమేయాన్ని (ఆర్ధిక ఉద్దీపన పేరు చెప్పి) అంతకంతకీ పెంచుతున్నది.
అగ్ర దేశాలు ఏమి శాసిస్తే దానికి తందానా తాన అనటమే పరిపాలనా ?
ఇది నవీన కాలపు సంక్షేమమా ?