Sunday, March 28, 2010

అమ్మ

ఈ రోజుకి అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళి పది సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది.

ఆవిడని తల్చుకోని క్షణం కానీ,సంఘటన కానీ లేదు.

ఇంట్లో ఒక వ్యక్తి మరణం కొంత విషాదాన్ని, కొంత శూన్యాన్ని మిగల్చటం సహజం, కొంత కాలానికి మర్చిపోయి మళ్ళీ మన దైనందిన జీవితపు పరుగులో పడటం కూడా సహజం.

మా అమ్మ భార్య గా మా నాన్నకి, తల్లి గా మాకూ ఒక వెలితిని మిగల్చటం లో పెద్ద ఆశ్చర్యం ఉండక పోవచ్చు. అంత ప్రభావం ఆవిడ మనవల మీద కూడా కలిగించింది. ఆవిడకి పదకొండు మంది మనవలు . వాళ్ళకి ఆవిడ ఒక అమ్ముమ్మ/నాయనమ్మ మాత్రమే కాదు, ఒక గురువు, దిశా నిర్దేశకురాలు, దైవం అన్నీ.

ఇంతే కాదు,ఆవిడ పరిచయం ఉన్న వాళ్ళు అందరూ ఆవిడ వ్యక్తిత్వాన్ని శ్లాఘించటం, సమర్ధతని/వ్యవహార
ఙ్గ్నానాన్ని మెచ్చుకోవటం అరుదుగా జరిగే విషయం కాకపోయినా, గొప్ప విషయమే.

ఆవిడ లౌకికమైన చదువులు చదువుకోలేదు, డిగ్రీ లు పొందలేదు.

కానీ మాకు ఎలా బతకాలో, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో, పరిష్కారం ఎల వెతుక్కోవాలో,మనుషులని ఎలా అర్ధం చేసుకోవాలో, మనస్తత్వాలని ఎలా అంచనా వెయాలో చక్కగా నేర్పి మమ్మల్ని అందరినీ బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దింది. ఒక ఆడది, అందునా నలుగురు పిల్లల తల్లి సమాజానికి ఏమి చెయ్యగలిగిందో చేసి చూపించి తన 59 అ యేట హఠాత్తుగా రెప్ప పాటు కాలం లో మేము బిత్తర పోయి చూస్తూ ఉండగా అనంత వాయువుల్లో కలిసిపోయింది.

ఆవిడకి చదువు అంటే ఎంతో ఇష్టం, గౌరవం. అందుకే మాకు చిన్నప్పుడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్, స్వామి వివేకానంద,ఆది శంకరా చార్య, త్యాగయ్య గురించి తను విన్నవి, చదివి తెలుసుకున్నవి కధలు కధలు గా ఆకట్టు కునే విధం గా చెప్పేది.

చాణక్త్యుడి అర్ధ శాస్త్రం గురించి చెబుతూ, పరిపాలన లో ఒక రాజు తీసుకో వలసిన జాగ్రత్తలు, ప్రజల పట్ల రాజుకి ఉండ వలసిన భావనలు అర్ధం అయ్యేట్లు చెప్పేది.వాటి అధారం గా రాజులు పాలన చేశారు కాబట్టే, మనకి ఇప్పటికీ ఇంకా ఆ చాయలు (ఎంత అధర్మం పెచరిల్లి పోతున్నా కుడా)అక్కడక్కడా కనిపిస్తూ ఊరట కలిగిస్తున్నాయి అని చెప్పేది.

ప్రక్రుతిని ప్రేమించటం, మనుషులని ప్రేమించటం, ఆర్తులని ఆదుకోవటం నేర్పించింది.

సంపాదించుకున్నడబ్బు తో ఎలా పొదుపు గా వెలితి అనేది తెలియకుండా, అసంత్రుప్తి లేకుండా బతకాలో నేర్పించింది. మనిషికి సంత్రుప్తి ఉండటం ఎంత అవసరమో, అది లేని జీవితాలు ఎలా నరక ప్రాయం గా ఉంటాయొ ఉదాహరణలతో చెప్పేది.

ఎవరైనా వ్రుత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తే, అది చూసి వాళ్ళు అలా సాధించటానికి చేసిన క్రుషి ని, అందుకోసం వాళ్ళు చేసిన త్యాగాలని అభినందించాలే కానీ కువిమర్శలు చెయ్యకుడదు అని చెప్పేది.వాళ్ళని చూసి అసూయ పడకూడదని, మనస్ఫూర్తి గా సంతోషించాలని చెప్పేది.

జీవితం లో సానుకూల వైఖరి ఎంతో అవసరమని, ఆర్తులని చూసి స్పందించమని చెప్పేది.

స్రుష్టి లో అందరు ఒకే విధమైన సమర్ధతలతో, ఙ్గ్నానం తో, తెలివి తేటలతో ఉండరు కనుక అవి లేని వాళ్ళ పట్ల సానుభూతి తో, అవగాహనతో ఉండాలని చెప్పేది.మనుషులని అర్ధం చేసుకుని వాళ్ళతో ప్రవర్తించటం నేర్చుకోమని చెప్పేది.

నేను బ్యాంక్ లో ఆఫీసర్ గా చేరటానికి ప్రోత్సహించి, ఆడపిల్లలు స్వావలంబన తో జీవించటం ఎంతో అవసరం అని చెప్పి నేను ఆవిడ కోరుకున్నట్లు బ్యాంక్ ఆఫీసర్ ని అయ్యాక ఎంతో త్రుప్తి పొందింది.

నన్ను అన్నతగా ప్రోత్సహించిన వ్యక్తి, నేను ఉద్యోగం లొ నించి (వీఆరెస్ ద్వారా) విరమించు కోవాలని నిర్నయించు కునే సమయానికి నాకు అందుబాటు లో లేకుండా వెళ్ళి పోయింది. నేను చేసింది తప్పో ఒప్పో తెలియచేసేటందుకు ఆవిడ లేని వెలితి ఏల పూడ గలదు.

ఆవిడ తీర్చి దిద్దిన మనవలు ఇవ్వాళ్ళ ఎంతో వ్రుద్ధి లోకి వచి పెద్ద పెద్ద చదువులు చదువుకుని డాక్టరేటె లు చేస్తూ ఉంటే చూసి ఆనందించి, వాళ్ళని ఆశేర్వదించటానికి ఆవిడ లేని వెలితి ని మాటల్లో ఎలా చెప్పగలను?

ఆవిడ చూపించిన దారిలొ నడిచి, పది మందికి ఉపయోగపడటం కన్న మేము ఆవిడకి ఇవ్వ గలిగిన నివాళి ఏముంది.

అదే చేసె ప్రయత్నం లో నా మనసు ని పది మంది తో పంచుకుందామని నేను ఆరాటపడి ఈ విధం గా క్రుతక్రుత్యు రాలిని అయ్యానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

ఇది వ్యక్తి గతం అయినా కూడా, ఒక తల్లి తల్చుకుంటే సమజానికి తన వంతు ధర్మం గా ఎంత సేవ చెయ్యగలదో చెప్పటానికి ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను.

"సర్వే జనా స్సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు"

సెలవు.